celestial poem

నిశీధి సంద్రం

సాయం సంధ్య వేళల్లోనో
అర్ధరాత్రి ఉన్నట్టుండి మెలకువై
ఆరుబయట తిరుగుతూనో!
అప్రయత్నంగా పైకి చూసినప్పుడు…..

చాన్నాళ్ల కింద ఎటొ వెళ్లిపోయి
హఠాత్తుగా మార్కెట్ లో కలిసిన
మిత్రుడిలా ఓరియన్ నక్షత్ర మండలం
ఆకాశం లో కనిపించి మురిపిస్తుంది!
వృషభ రాశిలో పైన మూడు
కింద రెండు మధ్యలో
అడ్డంగా మూడు నక్షత్రాలతో
కాల పురుషుడు నాలో స్తబ్ధత
తరుముతుంటాడు!

నవమినాటి వెన్నెల
చెంపల్ని చల్లగా నిమురుతుంది!
నీలో ఏ మూలో వున్నదిగులు
తెలి మబ్బై తేలి పోతుంది!

మర్నాడెప్పుడో ఓ చీకటి సాయంత్రం వేళ
చంద్రుడింకా క్షితిజం మీదికి ఎగబాగక ముందు
నిర్మానుష్యపు తావులలో
ఒంటరిగా నడుస్తున్నప్పుడు
శుక్ర వంక నీలివెన్నెలలో
నీ నీడకనిపించి మనసు అంబరమౌతుంది!

పగటి వగలు మొహం మొత్తి
చెత్తు మీద కెక్కి ఎప్పట్లాగే
ఆకాశంలోకి దూకుతాను!

ఉత్తరాన సప్త ఋషులు
దక్షిణాన వృశ్చిక రాశుల
ప్రదక్షిణా వాలులలో
మహా ఇష్టంగా ఈదుతాను!

భయ పెట్టే శని కూడా
ఓపౌర్ణమినడిరేయి చంద్రుడి వెనక్కువెళ్లి
నాతో దాగుడమూతలు ఆడతాడు!

అరుదుగా ఎప్పుడో శుక్ల పక్ష పు తొలి రోజున
నెల వంక కొన మీద శుక్ర వంక
ముక్కెరయి మెరుస్తుంది!
స్తబ్దంగా కనిపించే నిశీధిలో
మనసు పాలపుంతై సందడి చేస్తుంది !

ఉలికిపడే ఉల్కల క్షణికావేశాలు
గ్రహాల గ్రహణాల అహాల పట్టు విడుపులు
తరచి చూస్తే ఎన్ని అందాలు అర్థాలు!

నీలతారలు అరుణ తారలు
ధవళ తారలు జంట తారలు
వామన తారలు బృహత్తారలు
నవ్య తారలు కాలం తీరిన వృధ్ధ తారలు!
నిష్ఠగాఅడిగితే నిశీధి నీమెడలో
తారా హారాలు వేన వేలు
ప్రసాదిస్తుంది!

మనకు లాగే గగనానికీ
ఓ గాంధీ వున్నాడట తెలుసా!
గాంధీ పోయినరోజు తప్ప
364రోజులు కనిపిస్తాడట!
వింటే ప్రతిచుక్కా
ఇలాంటి కథేదో చెప్తుంది!

కథ కంచికి చేరేలోపు
విహారం కట్టి పెట్టి
ఇంటి పెట్టె తెరుస్తాను!
ఇక్కడా ఓ చిన్న
ఆకాశం దర్శనమిస్తుంది!
నా చుట్టేతిరిగే నక్షత్రంలా మావిడ!
మాబుల్లి ఉపగ్రహాలు!
ఒక్కటిలా కనిపించే
సిరియన్ జంట నక్షత్రంలా
ఒక్క క్షణం అర్ధం కాదు
ఎవరు ఎవరిచుట్టూ తిరుగుతారో!

తను లేకుండా ఈ విహరాలేంటని
అర్ధాంగి అరుణ తారౌతుంది
ఉక్రోషాల ఉల్కాపాతాలు కురిపిస్తుంది!
ఆ ఉగ్ర నయన సౌందర్యాన్ని నాలోకి మౌనంగా
వంపుకోడమే నాకప్పటికి స్ఫురించే తారక మంత్రం..
తీరిగ్గా…
అలకల అమావాస్యలుతీరి
మర్నాటికి మోమున చిర్నవ్వుల
నెలవంకలు వికసించడం చూసి
మనసు మానస సరోవరమే అవుతుంది!
ఇలా…
శుక్ల పక్షాలు కృష్ణ పక్షాలు అలవాటై
ఇరుపక్షాల సంధ్యలలో
నేను మరోసారి ఆకాశంలో దూకేస్తాను!

( చంద్ర శేఖర్ ప్రతాప)
కరీంనగర్
M:9948856377

ఒరియన్ నక్షత్ర మండలం
Standard